పాక్ ఎన్నికలు: ముషార్రఫ్ కు దెబ్బ
ఇస్లామాబాద్: పాకిస్తాన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ కు ఎదురు దెబ్బ తగిలింది. ముషారఫ్ కు అనుకూలమైన పాలక పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (క్యూ) - పిఎంఎల్ (క్యూ) పార్లమెంటరీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసింది.
దివంగత బెనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి), నవాజ్ షరీఫ్ నాయకత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్) - పిఎంఎల్ (ఎన్) అతి పెద్ద పార్టీలుగా అవతరించాయి. అయితే ఏ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. నవాజ్ షరీష్ పిపిపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇందుకు గాను ఆయన జర్దారీతో చర్చలు జరపడానికి సిద్ధపడుతున్నారు. దీంతో ఎనిమిదేళ్ల ముషార్రఫ్ పాలనకు ముప్పు వాటిల్లింది. బెనజీర్ భుట్టో హత్యతో సానుభూతి ఓట్లతో పిపిపి అత్యధిక సీట్లను గెలుచుకుంది. పిపిపికి 85 సీట్లు రాగా, పిఎంఎల్ (ఎన్)కు 65 సీట్లు వచ్చాయి.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో 269 సీట్లు ఉండగా ఇప్పటి వరకు 248 సీట్ల ఫలితాలు వెలువడ్డాయి. పిఎంఎల్ (క్యూ)కు 37 సీట్లు మాత్రమే వచ్చాయి. మంత్రులు కొంత మంది ఓటమి పాలయ్యారు. ఎంక్యూఎంకు 19 సీట్లు, ఎఎన్ పికి 10 సీట్లు, పిపిపి (ఎస్)కు ఒక్క సీటు వచ్సాయి. ఇతరులు 31 సీట్లు గెలుచుకున్నారు. మూడు జాతీయ అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగలేదు. రెండు నియోజకవర్గాల ఫలితాలను ఎన్నికల సంఘం నిలిపేసింది.
ప్రొవిన్షియల్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో పిఎంఎల్ (ఎన్) పంజాబ్ లో తిరుగులేని విజయం సాధించింది. పిపిపి సింధ్ లో ముందంజలో ఉంది. సింధ్ లో మొదటి నుంచి పిపిపికే గట్టి పట్టు ఉంది.












Click it and Unblock the Notifications