ఎమ్మెస్సార్ తప్పు కాదు: ఉప్పునూతల
హైదరాబాద్: తెలంగాణ విషయంలో తమ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు వ్యాఖ్యలను తప్పు పట్టాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిస్పందించాలనే ఉద్దేశంతోనే ఎమ్మెస్సార్ మాట్లాడి ఉంటారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణకు అనుకూలంగా ముఖ్యమంత్రి ప్రతిస్పందించాలనేది తమ అభిమతమని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి చొరవ తీసుకుని తెలంగాణ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని ఆయన అభిప్రాయపడ్డారు. తగాదాలు పెరిగి పరిస్థితి విషమించే దాకా చూడడం సరి కాదని ఆయన అన్నారు. సమస్యను పొడిగించడం దేనికని, ఎప్పుడైనా విడిపోవాల్సిందేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కాదని పార్టీ అధిష్ఠానవర్గం తెలంగాణ ఇవ్వలేదని ఎం.సత్యనారాయణ రావు సోమవారంనాడు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications