టిడిపి నేత నాగం జనార్దన్ రెడ్డికి జైలుశిక్ష
మహబూబ్ నగర్: ప్రస్తుత మంత్రి జి. చిన్నారెడ్డి వేసిన పరువు నష్టం దావాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, శాసనసభ్యుడు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డికి జైలు శిక్ష పడింది. నాగం జనార్దన్ రెడ్డికి ఆరు నెలల జైలు శిక్ష, 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ మహబూబ్ నగర్ మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. తనది దొంగ డాక్టరేట్ అని అరోపించినందుకు చిన్నారెడ్డి నాగం జనార్దన్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. చిన్నారెడ్డి వ్యవసాయ విద్యలో డాక్టరేట్ తీసుకున్నారు. అయితే అది దొంగ డాక్టరేట్ అని నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. దీనిపై చిన్నారెడ్డి పరువు నష్టం దావా వేశారు. దాదాపు ఆరు నెలల విచారణ అనంతరం మంగళవారం కోర్టు తీర్పు వెలువరించింది.
జరిమానా చెల్లించిన నాగం జనార్దన్ రెడ్డి బెయిల్ తీసుకున్నారు. జిల్లా కోర్టులో అపీల్ చేసుకోవడానికి మున్సిఫ్ కోర్టు నాగం జనార్దన్ రెడ్డికి 15 రోజుల గడువు ఇచ్చింది. ఈ తీర్పుపై మంత్రి చిన్నారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. విదేశాల్లో ఎంతో కష్టపడి సాధించుకున్న డిగ్రీని బోగస్ అని నాగం జనార్దన్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధుల ముందు, అధికారుల ముందు అన్నారని, తనకు అది అవమానంగా తోచిందని ఆయన అన్నారు. ఇప్పటికైనా నాగం జనార్దన్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications