అసెంబ్లీ నుంచి తెరాస ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తీర్మానాన్ని ప్రతిపాదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు శాసనసభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ వారిని రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇంతకు ముందు ఈ నెల 18వ తేదీ వరకు సస్పెండ్ అయిన తెరాస సభ్యులు మంగళవారం శాసనసభకు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే తెలంగాణపై తీర్మానం ప్రతిపాదించాలని పట్టుబట్టారు. స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ఎంతగా చెప్పినప్పటికీ వారు తమ పట్టును వీడలేదు. దీంతో వారిని సభను స్పీకర్ రెండు రోజుల పాటు సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన తెరాస సభ్యులు శాసనసభ ఆవరణలో మోక్ అసెంబ్లీ నిర్వహించారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని నమ్మిస్తున్నారని తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు అన్నారు. శాసనసభలో తీర్మానం పెడితే ఎవరి వైఖరి ఏమిటో తేలిపోతుందని, అలా తేలిపోవడం ఎంతైనా అవసరమని వారన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకమని కాంగ్రెస్ ఎందుకు చెప్పలేకపోతున్నదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ జూనియర్లు సీనియర్లతో కలిసి తెలంగాణకోసం అధిష్ఠానవర్గంపై ఒత్తిడి తేవాలని తెరాస శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి సూచించారు. తీర్మానం ప్రతిపాదించే వరకు సభా కార్యక్రమాలను అడ్డుకుంటామని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు చెప్పారు.












Click it and Unblock the Notifications