కెసిఆర్ కు మగతనం ఉంటే...: కేశవ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై రాయలసీమకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అయ్యకు, అవ్వకు పుడితే రాజీనామా చేయాలని కెసిఆర్ రాయలసీమ నేతలకు సవాల్ విసరడంపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మీద కోపం వుంటే కెసిఆర్ కు మగతనం వుంటే రాజశేఖర రెడ్డిని విమర్శించాలని ఆయన అన్నారు. ఆ విధంగా కెసిఆర్ తనకు మగతనం ఉందో లేదో తేల్చుకోవాలని ఆయన అన్నారు. తమ మగతనాన్ని చూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. రాయలసీమ ప్రజలను, నాయకులను అవమానించే హక్కు కెసిఆర్ కు లేదని ఆయన అన్నారు. అలా అవమానించిందుకు క్షమాపణ చెప్పాలని ఆయన కెసిఆర్ ను డిమాండ్ చేశారు.
మీరు పుట్టిన గడ్డ మీద మీకు ఎంత మమకారం ఉంటుందో మేము పుట్టిన గడ్డ మీద మాకు అంతే మమకారం ఉంటుందని, అవమానిస్తే సహించలేమని ఆయన అన్నారు. కెసిఆర్ కు తెలంగాణ కావాలంటే ఇచ్చే వారి ముందు మోకరిల్లాలని, లేదంటే పోరాటం చేయాలని, కానీ తమను అవమానించే హక్కు కెసిఆర్ కు లేదని ఆయన అన్నారు. తెలంగాణలో కెసిఆర్ కు పట్టు పోయిందని, బిల్లు పెడతామని ఇల్లు కూడా కదలని కెసిఆర్ ను ప్రజలు నమ్మడం లేదని, దీంతో ప్రజలను రెచ్చగొట్టేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. తాము రాష్ట్రాన్ని కాపాడుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టి రాయలసీమ వారి మీదికి నెట్టేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications