సాగునీటి ప్రాజెక్టులపై దద్ధరిల్లిన అసెంబ్లీ
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల అవినీతి ఆరోపణలపై విచారణకు సభా సంఘాన్ని వేయడానికి ప్రభుత్వం నిరాకరించడంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు బుధవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల అక్రమాలపై శాసనసభ దద్ధరిల్లింది. అంతకు ముందు ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు నిధులు కేటాయించనందుకు నిరసనగా తెలుగుదేశం శాసనసభ్యులు శాసనసభకు పాదయాత్ర నిర్వహించే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల్లో తీవ్ర అవినీతి చోటు చేసుకుందని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల పనులు కాంట్రాక్టర్లు చేయడం లేదని, సబ్ కాంట్రాక్టర్లు మాత్రమే చేస్తున్నారని, దీని వల్ల పనుల్లో నాణ్యత లోపిస్తోందని, ముప్పై నలబై కోట్ల రూపాయల వరకు అవినీతి చోటు చేసుకుంటోందని ఆయన అన్నారు. అయితే ఆ విమర్శలను భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఖండించారు. ఒప్పందం ప్రకారమే పనలు సబ్ కాంట్రాక్టర్లు చేస్తున్నారని, అక్రమాలు లేవని, అటువంటి ఉంటే తమకు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
అర్హత లేని సబ్ కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారని, ఇందుకు సంబంధించి పత్రాలు తన వద్ద ఉన్నాయని జనార్దన్ రెడ్డి అన్నారు. ఈ సమయంలో గందరగోళం చెలరేగడంతో స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. సభా సంఘాన్ని వేయడానికి ప్రభుత్వం నిరాకరించడంతో తెలుగుదేశం సభ్యులు వాకౌట్ చేశారు.












Click it and Unblock the Notifications