రైల్వే బడ్జెట్ లో ఆంధ్ర కోటా తక్కువే
హైదరాబాద్: రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన ప్రాధాన్యం అంతంత మాత్రమే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని, పాట్నా రైల్వే స్టేషన్ సరసన సికింద్రాబాద్ ను నిలబెడతామని ఆయన చెప్పారు. హైదరాబాద్ - ఉస్మానాబాద్ ల మధ్య వారానికి మూడు రోజుల రైలును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. కడప - బెంగుళూరుల మధ్య కొత్త రైల్వే లైనును ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. చెన్నై - బెంగుళూర్ ఎక్సుప్రెస్సును ప్రశాంతినిలయం వరకు పొడిగించనున్నట్లు ఆయన తెలిపారు.
తిరుపతి - నిజామాబాద్ కృష్ణా ఎక్సుప్రెస్సును ఆదిలాబాద్ వరకు పొడిగించనున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. మచిలీపట్నం - బెంగుళూర్ ల మధ్య వారానికి మూడు రోజులు రైలును నడుపుతామని ఆయన చెప్పారు. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య వారానికి మూడు రోజులు గరీబీ రథ్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. జగ్గయ్యపేట - జాన్ పాడు - విష్ణుపురం రైల్వే లైనుపై దృష్టి పెడతామని, నంద్యాల - ఎర్రగుంట్ల రైల్వే లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. కృష్ణపట్నం ఓడరేవుకు కొత్త రైల్వే లైన్ ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications