అసెంబ్లీ: అసైన్డ్ భూములపై వాకౌట్
హైదరాబాద్: అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలుగుదేశం, సిపియం, సిపిఐ సభ్యులు గురువారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూములను ప్రజా ప్రయోజనాల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు రాజ్యాంగ విరుద్ధంగా కట్టబెడుతున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. కొంత మంది చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని వాటిని ప్రభుత్వం విక్రయిస్తోందని, అలా విక్రయించే అధికారం ప్రభుత్వానికి లేదని, వాటిని పేదలకు అప్పగించాలని తెలుగుదేశం సభ్యుడు చెన్నమనేని రాజేశ్వరరావు అన్నారు.
ప్రజాప్రయోజనాల పేరుతో ప్రభుత్వ భూములను మసాజ్ సెంటర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, బార్లకు ఇస్తోందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దాదాపు 30 వేల ఎకరాలను అలా అప్పగించారని ఆయన అన్నారు. అసైన్డ్ భూములను కొన్న వ్యక్తులను ప్రాసిక్యూట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములు కొన్న రాజకీయ నాయకుల పేర్లు వెల్లడించదలుచుకోలేదనడం సరి కాదని, వారి పేర్లను వెల్లడించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అక్రమంగా అసైన్డ్ భూములను కొన్నవారిలో శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఉన్నారని, వారి పేర్లను వెల్లడిస్తే కాంగ్రెస్ పరువు పోతుందని, అందుకే పేర్లు చెప్పడానికి ప్రభుత్వం వెనకాడుతోందని ఆయన అన్నారు.
నిరుపేదల వద్ద ఉన్న అసైన్డ్ భూములను క్రమబద్దీకరిస్తామని, ఇందుకు గాను ఒక చట్టం తెస్తామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారు. తాము రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదని ఆయన చెప్పారు. ప్రజా ప్రయోజనాల కోసమే భూములను అప్పగిస్తున్నామని ఆయన చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో అసైన్డ్ భూములు కలిగి ఉన్న పెద్దలకు ఒక్క నోటీసు కూడా ఇవ్వని చంద్రబాబు తమపై విమర్శలు చేయడం తగదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications