నేను సమైక్యవాదిని కాను: చిన్నారెడ్డి
హైదరాబాద్: తాను సమైక్యవాదిని కాదని, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును కోరుకుంటున్నానని గ్రామీణాభివృద్ధి మంత్రి జి. చిన్నారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని తాను ఒక్కడ్ని అడిగినంత మాత్రాన ఏం ఫలితం ఉంటుందని ఆయన అడిగారు. తెలంగాణపై తాము తమ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాల వల్ల ఖాళీ అయిన స్థానాల్లో కచ్చితంగా కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పలేనని ఆయన అన్నారు. ఈ ఉప ఎన్నికలను రెఫరెండంగా భావించాలా, వద్దా అనే విషయంలో పార్టీలో సంశయం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై తాము పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మరో మంత్రి జి. వినోద్ చెప్పారు. ఈ నెల 14వ తేదీన సోనియా గాంధీ రాష్ట్ర పర్యటన అనంతరం తెలంగాణపై పార్టీ అధిష్ఠానవర్గం నెలలోపల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
