భువనగిరి సభపై వెనక్కి తగ్గం: పాల్వాయి
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంటును నిరూపించడానికి ఈ నెల 24వ తేదీన తలపెట్టిన భువనగిరి సభ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు సొంత లం ఉందని, ఇతర పార్టీల నుంచి ప్రజలను అరువు తెచ్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గతంలో తను, ప్రస్తుత సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి నల్లగొండలో నిర్వహించిన సభకు లక్ష మంది దాకా వచ్చారని ఆయన చెప్పారు.
తమపై విశ్వాసం ఉన్నవారు, తమను ఇష్టపడే వారు, తెలంగాణ కావాలని అనేవాళ్లు సభకు వస్తారని ఆయన చెప్పారు. తమ సభ పార్టీకి గానీ, ముఖ్యమంత్రికి గానీ, ప్రభుత్వానికి గానీ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. తాను ఇంచార్జీగా ఉన్న వరంగల్, హన్మకొండ లోకసభ స్థానాల్లో ఎవరు గెలుస్తారనే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని హోం మంత్రి కె. జానా రెడ్డి విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. సర్వే చేయించిన తర్వాత ఏమైనా చెప్పగలనని, ఇంకా తాను పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications