ఉద్యోగులకు 5.65 శాతం డిఎ పెంపు
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల అనంతరం తొలిసారిగా గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలకనిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5.65 శాతం కరువు భత్యాన్ని (డిఎని) పెంచుతూ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 700 కోట్ల రూపాయల భారం పడుతుందని మంత్రి వర్గ సమావేశం వివరాలను మీడియా ప్రతినిధులకు వెల్లడించిన సమాచార, పౌర సంబంధాల మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉన్న కోటీ 87 లక్షల మంది తెల్ల రేషన్ కార్డులున్నవారందరికీ ఈ నెల 9వ తేదీ నుంచి రెండు రూపాయలకు కిలోబియ్యం పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
కృష్ణానదిపై నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్టు భూసేకరణ కోసం ప్రత్యేక యూనిటును ఏర్పాటు చేయాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించింది. నెల్లూరు జిల్లాలో తలపెట్టిన అంతర్జాతీయ లెదర్ పార్కుకోసం 450 ఎకరాల భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రామనారాయణరెడ్డి చెప్పారు. పట్టణ ప్రాంతాల పేద మహిళలకు కూడా ఇందిరా క్రాంతి పథకం కింద పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. డ్రగ్ ఇన్సెపెక్టర్ల, అసిస్టెంటు డ్రగ్ ఇన్సెపెక్టర్ల ఖాళీల భర్తీకి, ప్రభుత్వ యునానీ హోమియో కళాశాలల్లో 32 ప్రొఫెసర్ల, 32 లెక్చరర్ల పోస్టుల భర్తీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications