పక్కదారికే అసెంబ్లీ చర్చ: హరీష్
సిద్ధిపేట: తెలంగాణ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే శాసనసభలో అవిశ్వాస తీర్మానం చర్చను ముందుకు తెచ్చారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు హరీష్ రావు విమర్శించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు పరస్పరం చేసుకున్న విమర్శలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లున్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రాన్ని ఈ ఇద్దరు నాయకులు దోచుకున్నారని ఆయన అన్నారు.
అవిశ్వాసంపై చర్చలో తెలంగాణ సమస్యలను పట్టించుకోలేదని ఆయన అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ చేసిన విమర్శకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆ ప్రాజెక్టుపై మీ వైఖరేమిటో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారని, దాంతో దేవేందర్ గౌడ్ పోతిరెడ్డిపాడుపై మళ్లీ మాట్లాడలేకపోయారని ఆయన అన్నారు. కాంగ్రెస్ తెలంగాణ నాయకులు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. తెలంగాణ గొంతు నొక్కే పనికి ముఖ్యమంత్రి ఒడిగట్టారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications