హైదరాబాద్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నేడు నందమూరి కుటుంబ వారసులను కలుసుకున్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో సినీతారల ప్రవేశంతో రాజకీయం వేడెక్కనుంది. చిరంజీవి రాజకీయ పార్టీ పెడతారన్న ఉద్దేశంతో ఆయనకు పోటీగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ విందు సమావేశం నిర్వహించారు. 2004 ఎన్నికలలో టీడీపి ఘోర పరాజయం చవి చూసింది. 2009 ఎన్నికలలోనైనా పార్టీ అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ను తెర మీదికి తెస్తున్నారు. చిరు పార్టీ పెడితే ఎక్కువ నష్టపోయేది టీడీపి అనీ, చిరుకి చెక్ పెట్టడానికి ఇవతల మంచి పట్టున్న జూనియర్ ఎన్టీఆర్ను ప్రచారంలో దింపాలని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారు. వీరు సమావేశంలో ఏమి చర్చించారనేది తెలియలేదు కానీ రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తున్నది.