నకిలీ నోట్ల కిలాడీ అరెస్టు
హైదరాబాద్: నకిలీ దొంగ నోట్లను చెలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠా హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసుల చేతికి చిక్కింది. హైదరాబాదులోని నాంపల్లిలోని ఓ లాడ్జీలో మకాం వేసి ఆ ముఠా సభ్యులు నకిలీ నోట్లను చెలామణి చేయడానికి ప్రయత్నించారు. వారి నుంచి రెండు లక్షల రూపాయల నకిలీ నోట్లను, ముద్రణా యంత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న నాగరాజు ఇటువంటి కేసుల్లోనే గతంలో రెండు సార్లు అరెస్టై బెయిలుపై విడుదలయ్యాడు.
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాగరాజు గతంలో హైదరాబాదులోని చందానగర్ ప్రాంతంలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు. అది సరిగా నడవకపోవడంతో నకిలీ నోట్లను ముద్రించి చెలామణిలోకి తేవడానికి ప్రయత్నిస్తూ 2004లో అరెస్టయ్యాడు. బెయిలుపై విడుదలై కాకినాడకు మకాం మార్చాడు. అక్కడ ఇదే పని చేస్తూ 2005లో పోలీసులకు పట్టుబడ్డాడు. మళ్లీ బెయిలుపై విడుదలై తన స్వగ్రామం వెళ్లాడు. అక్కడ మరో ఇద్దరిని కూడగట్టుకుని 2008 ఫిబ్రవరి నుంచి నకిలీ నోట్లను ముద్రించి చెలామణిలోకి తేవడానికి ప్రయత్నించి హైదరాబాదులో పోలీసులకు చిక్కాడు.












Click it and Unblock the Notifications
