మా తొలి విజయం: కెసిఆర్

తాము చేర్యాల, ముషీరాబాద్ శాసనసభా నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని సిపియం నాయకుడు వై. వెంకటేశ్వరరావు చెప్పారు. మిగతా స్థానాల్లో ఇతర రాజకీయ పార్టీలతో అవగాహనను బట్టి ఉంటుందని ఆయన చెప్పారు. తాము ఈ నెల 25, 26 తేదీల్లో నాగార్జునసాగరులో జరిగే పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో ఉప ఎన్నికల్లో అనుసరించే విధానాన్ని నిర్ణయించుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో సిపియం, తెలుగుదేశం కలిసి పని చేసే అవకాశం ఉంది. తాము ఒంటరిగానే పోటీ చేస్తామని తెరాస ప్రకటించింది. తెలంగాణ నినాదంతోనే ఉప ఎన్నికలకు పోతామని బిజెపి ప్రకటించింది.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. 2004 ఎన్నికల్లో పోటీ ఓడిపోయిన వారినే తెలంగాణలోని ఉప ఎన్నికలు జరిగే స్థానాలకు అభ్యర్థులుగా పెట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. సికింద్రాబాద్ నుంచి తలసాని శ్రీనివాస యాదవ్, ఖానాపూర్ నుంచి రమేష్ రాథోడ్,హుజూరాబాదు నుంచి ఇ. పెద్దిరెడ్డి, స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి, ఆలేరు నుంచి మోత్కుపల్లి నర్సింహులు, డిచ్ పల్లి నుంచి మండవ వెంకటేశ్వరరావు, ఆదిలాబాద్ లోకసభ స్థానం నుంచి వేణుగోపాలాచారి పోటీ చేస్తారు.
ఉప ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. తెలుగుదేశం, బిజెపిలు మినహా మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో మంత్రులను రంగంలోకి దించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కరీంనగర్ లోకసభ స్థానం నుంచి జీవన్ రెడ్డిని, వరంగల్, హన్మకొండ నియోజకవర్గాల నుంచి రెడ్యా నాయక్, పొన్నాల లక్ష్మయ్యలను, ఆదిలాబాద్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డిని పోటీకి దించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఉప ఎన్నికల్లో పొత్తులపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పారు. ఉప ఎన్నికలపై ఆయన డి. శ్రీనివాస్ తో మాట్లాడారు.












Click it and Unblock the Notifications