తెరాసను ఓడిస్తాం: మంత్రులు
హైదరాబాద్: తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తాం, అభివృద్ది నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జి. చిన్నారెడ్డి చెప్పారు. ఉప ఎన్నికలపై చర్చించడానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు చిన్నారెడ్డి, దామోదరం రాజనర్సింహ, సబితా ఇంద్రారెడ్డి, తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఈ విషయంపై పార్టీ అధిష్ఠానవర్గం పరిశీలన జరుపుతోందని, తాము తెలంగాణపై సోనియా గాంధీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చిన్నారెడ్డి చెప్పారు. జడ్చర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి మల్లు రవి ముందుకు వచ్చారని, తాను ఊహించలేదని, పార్టీ కోసం మల్లు రవి అందుకు సిద్ధపడ్డారని ఆయన అన్నారు.
తెలంగాణ సెంటిమెంటు అనుకున్నంత లేదని మరో మంత్రి దామోదరం రాజనర్సింహ అన్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితిని చిత్తుగా ఓడిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పేదలకు, మహిళలకు, రైతులకు ఎంతో మేలు చేశారని, సంక్షేమ పథకాలు చేపట్టారని, అవే ఉప ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని ఆయన అన్నారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం ప్రజలకు ఎంతో చేసిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications