హైదరాబాద్: తనపై తనకు, తన సహచరులపై నమ్మకం లేకనే తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణాల శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు తనపై తనకు నమ్మకం లేదని, తన సహచరులపై నమ్మకం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అందుకే బాలకృష్ణను, హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ సహకారం తీసుకుంటున్నారని ఆయన అన్నారు.తన తొమ్మిదేళ్ల పాలనలో సామాన్యులను విస్మరించిన చంద్రబాబు తన చైతన్య యాత్రలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం తెలుగుదేశం పార్టీ చేతగానితనమని ఆయన వ్యాఖ్యానించారు. తెర్లాం శాసనసభా నియోజకవర్గంలో తాము పోటీ చేస్తామని ఆయన అన్నారు.