మాదిగల దండయాత్ర ఉద్రిక్తం
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఉషా మెహ్రా కమిటీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని డమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) సోమవారం తలపెట్టిన మాదిగల దండయాత్ర సభ ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాదుకు తరలి వస్తున్న ఎమ్మార్పీయస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఎమ్మార్పియస్ సభను తలపెట్టింది. పోలీసుల చర్యల పట్ల ఎమ్మార్పియస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉషా మెహ్రా కమిటీని వెంటనే ప్రభుత్వానికి సమర్పించకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఎమ్మార్పీయస్ నేత మందకృష్ణ మాదిగ చెప్పారు.
ఎమ్మార్పీయస్ నేతలతో ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి, రాజ్యసభ సభ్యుడు నంది ఎల్లయ్య చర్చలు జరిపారు. తాము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని నంది ఎల్లయ్య చెప్పారు. వర్గీకరణ జరిగే లోగానే నియామకాలు జరిగిపోతున్నాయని, దీని వల్ల మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మార్పీయస్ నేతలు నిలదీశారు. వర్గీకరణ జరిగే వరకు నియామకాలను ఆపేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వచ్చి తమకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో మల్లు రవి వచ్చి వారికి తగిన హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications