మందకృష్ణకు బెదిరిపోతున్నారు: జూపూడి
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీరకణ ప్రయత్నాలను నిరసిస్తూ మాల మహానాడు కార్యకర్తలు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు. మాలమహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మాలమహానాడు కార్యకర్తలు ధర్నా చేశారు. దీంతో హైదరాబాదులోని లక్డీకాపూల్ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. జూపూడి ప్రభాకరరావుతో సహా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నాయకుడు మందకృష్ణ మాదిగ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ప్రభుత్వం భయపడి వర్గీకరణకు పూనుకుంటోందని జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. ప్రభుత్వం మాలల మనోభావాలను దెబ్బ తీస్తోందని ఆయన అన్నారు. మందకృష్ణ నిరాహార దీక్షలకు ప్రభుత్వం బెదిరిపోతోందని ఆయన అన్నారు. వర్గీకరణకు పూనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తప్పదని ఆయన అన్నారు. ఉషా మెహ్రా కమిషన్ ను రద్దు చేసి, వర్గీకరణ ప్రయత్నాలను విరమించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం ముందు కూడా మాలమహానాడు కార్యకర్తలు ధర్నా చేశారు.












Click it and Unblock the Notifications
