మంత్రి పదవికి జీవన్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్: రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి టి. జీవన్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గురువారం ఉదయం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి అందజేశారు. కరీంనగర్ లోకసభ సీటు నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తున్నారు. ఈ పోటీ కోసమే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వేసుకున్న తెలంగాణ ముసుగును తొలగించేందుకే తాను పోటీ చేస్తున్నట్లు ఆయన మీడియా ప్రతినిధులకు తెలిపారు. తెలంగాణ వివక్షకు గురైందని, ఈ వివక్ష తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలోనే తొలుగుతుందని తాము భావిస్తున్నామని, ఈ మేరకు తమ పార్టీ అధిష్ఠానవర్గానికి విన్నవించామని, విషయం అధిష్ఠానం పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.
తెలంగాణ పట్ల తమ అనుకూల అభిప్రాయాన్ని ప్రజలు సాధారణ ఎన్నికల్లోనే వ్యక్తం చేశారని, మళ్లీ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలనుకుంటే సాధారణ ఎన్నికలు మార్గంగా ఉండేవని, తెరాస అర్థాంతరంగా రాజీనామా చేసి ప్రజాస్యామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఉప ఎన్నికల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని ఆయన అన్నారు. ఇది వరకు ఒకసారి కరీంనగర్ లోకసభకు రాజీనామా చేసి కెసిఆర్ సానుభూతితో గెలిచారని, సాధారణ ఎన్నికల్లో తమను ప్రజలు ఆదరించరనే భయంతో, ప్రజల సానుభూతితో గెలిచేందుకు రాజీనామాలకు ఒడిగట్టారని ఆయన అన్నారు. కెసిఆర్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఉప ఎన్నికల మార్గాన్ని ఎంచుకున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications