భారీ స్థాయిలో 'రామాయణ' మూవీ రిలీజ్.. తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్న దిల్ రాజు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'రామాయణ' ఒకటి. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ శ్రీరాముడిగా.. సాయి పల్లవి సీతమ్మగా నటిస్తున్నారు. అలాగే హనుమంతుడిగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సన్నీ డియోల్ కనువిందు చేయనున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది దీపావళి కానుకగా నవంబర్ 5 విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్లు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలో గ్రాఫిక్స్ అత్యద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. విజువల్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు.
ఇక రామాయణ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలిభాగం ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుండగా.. రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు భాగాల రామాయణ సినిమాను రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్ స్టర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నమిత్ మల్హోత్రా, యశ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. అలాగే ఈ మూవీకి 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వం వహించారు. రామాయణ చిత్రానికి ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏ ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ సంయుక్తంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు. తాజాగా ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఇక ఈ మూవీ రిలీజ్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ దక్కించుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ భారీ స్థాయిలో అత్యధిక స్క్రీన్స్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని త్రీడీ తో పాటు ఐమాక్స్ ఫార్మాట్ ఇతర అన్ని టెక్నాలజీ ఫార్మాట్లలో నవంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.












Click it and Unblock the Notifications
