సుప్రీంకు వైఎస్సార్సీపీ- నామినేషన్ల గడువు పొడిగింపు, ఏకగ్రీవాలపై స్టే సహా ..!
ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి అక్రమాలను అడ్డుకోవాలని కోరుతూ విపక్ష వైఎస్సార్సీపీ (YSRCP) ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ అభ్యర్ధులపై దాడుల నేపథ్యంలో నామినేషన్ల గడువు పొడిగింపు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసిన నేపథ్యంలో.. పార్టీ ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో సుప్రీంకోర్టును పలు కీలక అంశాలపై అభ్యర్ధనలు చేసింది. ఇందులో తాజాగా చోటు చేసుకుంటున్న అన్ని పరిణామాలనూ ప్రస్తావించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్ధులు నామినేషన్లు వేయనీయకుండా కూటమి ప్రభుత్వం, పోలీసుల సాయంతో అడ్డంకులు సృష్టిస్తుందని, వారిపై దాడులకు దిగుతోందని వైఎస్సార్సీపీ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో నామినేషన్లకు మరింత గడువు ఇచ్చేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరింది. దీంతో పాటు తమ అభ్యర్ధులకు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేందుకు తగిన భద్రత ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఢప్తి చేసింది. నామినేషన్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్ధులతో పాటు ప్రతిపాదకులకు సైతం భద్రత కల్పించాలని కోరింది.

స్థానిక ఎన్నికల్లో అభ్యర్ధుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించేందుకు అదనపు, ప్రత్యామ్నాయ కేంద్రాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును వైఎస్సార్సీపీ కోరింది. అలాగే నామినేషన్ల ప్రక్రియతో పాటు పోలింగ్, కౌంటింగ్ ను కూడా వీడియోగ్రఫీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. వీటితో పాటు రాష్ట్రంలో పలు చోట్ల అధికార కూటమి ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధుల్ని అడ్డుకుని ఏకగ్రీవాలు చేసుకుంటున్న అంశాన్ని కూడా పిటిషన్ లో ప్రస్తావించింది. ఇలాంటి ఏకగ్రీవాలపై స్టే ఇవ్వాలని వైఎస్సార్సీపీ తన పిటిషన్ లో సుప్రీంకోర్టును అభ్యర్ధించింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ చేపట్టబోతోంది.
రాష్ట్రంలో ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తయింది. దీన్ని పొడిగించాలని కోరుతూ అంతకు ముందు హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీకి సింగిల్ బెంచ్ లో, ఆ తర్వాత డివిజన్ బెంచ్ లోనూ నిరాశ తప్పలేదు. ఓసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎస్ఈసీ విధుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాత్రం ఏం చెబుతుందన్న చర్చ జరుగుతోంది.















Click it and Unblock the Notifications
