టిడిపి ఉప ఎన్నికల అభ్యర్థులు
గుంటూరు: ఉప ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశం ఖరారు చేసింది. నాలుగు పార్లమెంటు స్థానాలకు, శాసనసభా నియోజకవర్గాలకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో జరిగిన సమావేశంలో అభ్యర్థులను ఖరారు చేశారు. చేర్యాల, ముషీరాబాద్ శాసనసభా నియోజకవర్గాల్లో సిపిఎం అభ్యర్థులకు మద్దతు ప్రకటించాలని సమావేశం నిర్ణయించింది. కాగా, ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రతిపాదించిన ఖైరతాబాద్ శాసనసభా నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించలేదు. అభ్యర్థులు చాలా మంది 2004 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినవారే. అయితే వారు బలమైనవారే.
పార్లమెంటు నియోజకవర్గాల్లో హన్మకొండకు వెంకటేశ్వర్లు, వరంగల్లు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆదిలాబాద్ కు ఎస్. వేణుగోపాలాచారి, కరీంనగర్ కు ఎల్. రమణ పేర్లను ఖరారు చేశారు. శాసనసభా నియోజకవర్గాల్లో ఖానాపూర్ కు రమేష్ రాథోడ్, డిచ్ పల్లికి మండవ వెంకటేశ్వరరావు, ఎల్లారెడ్డికి జి. సురేందర్, కమలాపూర్ కు ముద్దసాని దామోదర్ రెడ్డి, మేడారంకు మాలం మల్లేశం, దొమ్మాటకు ముత్యంరెడ్డి, రామాయంపేటకు హనుమంతరావు, వికారాబాద్ కు సంజీవరావు, జడ్చర్లకు ఎం. చంద్రశేఖర్, హుజురాబాద్ కు ఇ. పెద్దిరెడ్డి, సిద్దిపేటకు రవీంద్రారెడ్డి, స్టేషన్ ఘనపూర్ కు కడియం శ్రీహరి, ఆలేరుకు మోత్కుపల్లి నర్సింహులు, సికింద్రాబాదుకు తలసాని శ్రీనివాస యాదవ్, తెర్లాంకు తెంటు లక్ష్మునాయుడు పేర్లను ఖరారు చేశారు.












Click it and Unblock the Notifications