ఆంధ్రజ్యోతి ఆఫీసుపై దాడి, విధ్వంసం
హైదరాబాద్: హైదరాబాదులోని ఆంధ్రజ్యోతి దినపత్రిక కార్యాలయంపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) కార్యకర్తలు సోమవారం దాడి చేశారు. కార్యాలయం అద్దాలు పగులగొట్టారు. పెట్రోల్ పోసి ఫర్నీచరును తగులబెట్టారు. దీంతో మంటలు ఉవ్వెత్తున లేచాయి. కార్యాలయం ఎదుట పార్కు చేసిన రెండు వాహనాల్లో దుండగులు వచ్చారు. దాడి అకస్మాత్తుగా జరగడంతో ఆంధ్రజ్యోతి కార్యాలయం భద్రతా సిబ్బంది బిత్తరపోయారు. ఈ దాడిలో ఎవరికీ అపాయం సంభవించలేదు.
దుండగులు రెండు క్వాలిస్ వాహనాల్లో 20 మంది దాకా వచ్చి, కర్రలతో, రాళ్లతో కార్యాలయంపై దాడి చేశారు. అనంతరం అవే వాహనాల్లో తిరిగి వెళ్లిపోయారు. ఆంధ్రజ్యోతిలో బాడుగ నేతలు పేర వచ్చిన వార్తాకథనాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీయస్ నేత మంద కృష్ణమాదిగ, బిసి సంక్షేమ సంఘం నాయకుడు ఆర్. కృష్ణయ్య, ఇతర కులసంఘాల నాయకులు ట్యాంక్ బండ్ వద్ద ప్రదర్శనకు దిగారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఊసరవెల్లుల నాయకత్వంలో కుల ఉద్యమాలు, మాటల్లో గాండ్రింపులు.. చేతల్లో బేరసారాలు, ఎన్నికల వేళ అధికారానికి దాసోహం, తైలం తాగుతున్న కుల దీపాలు, నేతల అవతారమెత్తుతున్న కబ్జాదారులు అంటూ ఆంధ్రజ్యోతి కుల ఉద్యమాలపై ఒక వార్తాకథనం రాశారు. వ్యూహం ప్రకారమే దాడి జరిగిందని ఆంధ్రజ్యోతి యాజమాన్యం అంటోంది. వరంగల్లులోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి జరిగింది. కార్యాలయం సిబ్బంది ప్రతిఘటించడంతో పత్రికలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాలకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications