హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కూతురు కవిత కూడా ఇప్పుడు రాజకీయాల్లో కాలు పెట్టారు. ఇప్పటికే ఆయన కుమారుడు కెటి రామారావు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మెల్లగా పార్టీలోకి వచ్చిన రామారావు ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కూతురు కవిత ఏ పార్టీ బాధ్యతలు లేకుండానే ఇప్పుడు ప్రచారంలోకి దిగారు. ఆమె సోమవారంనాడు ముషిరాబాద్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి నాయని నర్సింహారెడ్డి తరఫున ప్రచారం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి తెరాసకే ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె ఇటీవల తెలంగాణ కోసం ఓ పత్రిక పెట్టాలని అన్ని హంగులూ సమకూర్చుకున్నారు. ఎందుకో గాని అది ముందట పడలేదు.