పోలీసుల అదుపులో మందకృష్ణ
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తా కథనానికి నిరసనగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ ధర్నా చేస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగను పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి సంబంధించి ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన అనంతరం మిగతా వారిని అరెస్టు చేస్తామని, దాడికి ఉపయోగించిన రెండు వాహనాలను గుర్తించామని పోలీసు అధికారులు చెప్పారు. ఆంధ్రజ్యోతి కార్యాలయంపై ఎమ్మార్పీయస్ కార్యకర్తలే దాడి చేశారని నగర పోలీసు కమిషనర్ ప్రసాదరావు చెప్పారు. దాడి జరిగిన వెంటనే ఆయన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
పథకం ప్రకారమే తమ కార్యాలయంపై దాడి జరిగిందని ఆంధ్రజ్యోతి యాజమాన్యం విమర్శిస్తోంది. తమ కార్యాలయపై దాడి పత్రికా స్వేచ్ఛపై దాడి అని ఆయన అన్నారు. ఈ దాడిని జర్నలిస్టు సంఘాల నాయకులు ఖండించారు. విశాఖ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై కూడా దుండగులు రాళ్లు రువ్వి పారిపోయారు. పది జిల్లాల్లో ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద ప్రదర్శనలు జరుగుతున్నాయి. తాము ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద తగిన భద్రత ఏర్పాటు చేశామని, పికెట్లు కూడా ఏర్పాటు చేస్తామని పోలీసు కమీషనర్ చెప్పారు. ఈ దాడి విషయంలో పోలీసుల వైఫల్యం ఏదైనా ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications