ఓటమిలో ఆంధ్ర నేతల పాత్ర: ఉప్పునూతల
హైదరాబాద్: కర్ణాటకలోని కొంత మంది బిజెపి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు నేతలు సహకరించారని, అవసరం వచ్చినప్పుడు ఇవన్నీ బయటపెడుతామని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాతనైనా తమ పార్టీ నాయకత్వం కళ్లు తెరవాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సూచించారు. ఒక్కో రాష్ట్రం పోతుంటే వచ్చే ఎన్నికల్లో పార్టీకి గడ్డు కాలమే ఎదురవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే రాష్ట్రంలోనూ తమ పార్టీకి కష్టమేనని ఆయన అన్నారు.
తెలంగాణ ఇస్తామని గత ఎన్నికల్లో చెప్పామని, తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, అయినా తెలంగాణ ఇవ్వకపోవడం సరైంది కాదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) చేసిన త్యాగం తక్కువదేమీ కాదని ఆయన అన్నారు. తెరాస 16 సీట్లలో గెలుస్తుందని, గెలిస్తేనే తెలంగాణవాదం బలపడుతుందని ఆయన అన్నారు. తెరాసకు ఓటేసి గెలిపించాలని ఆయన నేరుగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications