బెంగుళూరు, మే 30 : బిజెపి చిరకాల కల ఫలించింది. ఎట్టకేలకు దక్షిణాదిన 'బిజెపి' అధికారం చేజిక్కించుకుంది. బిజెపి అభ్యర్ది యెడ్యూరప్ప దక్షిణాదిన మొట్టమొదటి బిజెపి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. యెడ్యూరప్ప, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకార ఘట్టాన్నిగవర్నర్ రామేశ్వర్ ఠాకూర్ పూర్తి చేయించారు. 29 మంత్రుల యెడ్యూరప్ప మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగువారే అవడం తెలుగువారు గర్వించాల్సిన విషయం. తెలుగువారైన గాలి జనార్దన్ రెడ్డి, కరుణాకర రెడ్డి, శ్రీ రాములు, కట్టా సుబ్రమణ్య నాయుడు తదితరులకు మంత్రివర్గంలో స్దానం లభించింది. జగధీశ్ శెట్టార్, కె.ఎస్. ఈశ్వరప్ప, శోభా కరంద్లజె, గోవింద్ కర్జోల్, సి.ఎం. ఉదసి. బి. శ్రీరాములు, ఎస్.ఎ.రవీంద్రనాద్, డాక్టర్ వి.ఎస్.ఆచార్య,రామచంద్ర గౌడ, శంకరలింగె గౌడ, రాందాస్, లక్ష్మణ్ సవడి, విశ్వేశ్వర హెగ్డె కగెరి, ఆర్ అశోక్, ఎస్. సురేశ్ కుమార్, యోగిశ్ భట్, క్రిష్ణయ్య శెట్టి మొదలైనవారు మంత్రులుగా ప్రమాణం చేశారు. 224 సీట్లలో బిజెపి సాధారణ ఆధిక్యతకు మూడు సీట్లు తక్కువగా 110 సీట్లను గెలుచుకుంది. ఆరుగురు ఇండిపెండెంటు సీట్లను తమ వైపు తిప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచారు. "దారిద్ర్య రేఖను తిరిగి నిర్వచించి కుటుంబానికి 60,000 రూపాయలను దారిద్ర్య రేఖ పరిదిగా నిర్ణయిస్తామని, ప్రతి గ్రామంలో ఒక సైబర్ కేఫ్ ను ఏర్పరుస్తామని" యెడ్యూరప్ప ఈ సందర్బంగా వాగ్దానం చేశారు. నీటి అవసరాన్ని తీర్చడానికి ఏర్పాట్లు చేస్తామని, ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి మెట్రోపాలిటన్ రవాణా అథారిటీని ఏర్పరుస్తామని బెంగుళూరు ప్రజలకు వాగ్దానం చేశారు. మాండ్య జిల్లాలోని కె.ఆర్.పేట్ తాలూకాలో జన్మించిన శ్రీ బూకనగెరె సిద్దలింగప్ప యెడ్యూరప్ప కొన్నాళ్ళు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లో కాజువల్ వర్కర్ గా పనిచేశారు.'రాష్ట్లీయ స్వయం సేవక్ సంఘ్' లోని ఒక మామూలు కర సేవకుని స్దాయినుండి దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి బిజెపి ప్రభుత్వాన్ని స్దాపించే వరకు జరిగిన ప్రస్దానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న యోధుడు శ్రీయెడ్యూరప్ప. ఆయనది ఎల్లప్పుడూ రైతుల పక్షమే. ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికైన యెడ్యూరప్ప తాను ఉపముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో దేశంలో మొట్టమొదటిసారిగా రైతుల సహకార రుణాలపై వడ్డీని 7నుండి 4 శాతానికి తగ్గించారు. వ్యవసాయ రుణాల మాఫీకై అవిశ్రాంతంగా కృషిచేశారు. ప్రతిపక్షనాయకుడిగా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలకు కర్ణాటక ప్రజలు ఆయనకు ఈ విధంగా కృతఙ్ఞతలు తెలుపుకున్నారు.