దేవెగౌడతో ఎర్రంనాయుడు భేటీ
న్యూఢిల్లీ: అణు ఒప్పందంపై యుపిఎ ప్రభుత్వం పార్లమెంటులో బలపరీక్షకు సిద్ధపడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె. ఎర్రంనాయుడు గురువారం ఢిల్లీలో మాజీ ప్రధాని, జెడి (ఎస్) నేత దేవెగౌడను కలిశారు. అణు ఒప్పందానికి వ్యతిరేకంగా ఓటు చేయాలని ఎర్రంనాయుడు దేవెగౌడను కోరినట్లు సమాచారం. అయితే తాను దేవెగౌడను మర్యాదపూర్వకంగానే కలిశానని ఆయన చెప్పారు. జెడి (ఎస్) అటు యుపిఎతోనూ, ఇటు ఎన్డీయేతోనూ లేకుండా తటస్థంగా ఉందని, ఈ స్థితిలో రాజకీయ పరిణామాలను తెలుసుకుందామని తాను దేవెగౌడను కలిశానని ఆయన చెప్పారు.
అణు ఒప్పందంపై పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని దేవెగౌడ చెప్పారు. ఇంత వరకు తమ పార్టీని గానీ, తనను గానీ ఎవరూ గుర్తించలేదని, పార్టీ బలంగా ఉంటేనే ఎవరైనా గుర్తిస్తారని, అందువల్ల పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. యుపిఎ ప్రభుత్వం విశ్వాస తీర్మానం పార్లమెంటుకు రావడానికి ఒకటి, రెండు రోజుల ముందు తాము నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
