దేశాభివృద్ధికి కలిసి పనిచేద్దాం: పిఎం
న్యూఢిల్లీ: దేశాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై వరుసగా ఐదో ఏడాది శుక్రవారం ఆయన జాతీయ పతాకను ఎగురవేశారు. అంతకు ముందు ఆయన రాజ్ ఘాట్ కు వెళ్లి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. మనల్లి రక్షించినవారిని ఈ రోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జమ్మూ కాశ్మీర్ లో హింస పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. మతం పేరుతో ప్రజలను విభజించాలని ప్రయత్నిస్తున్నవారి వల్ల దేశ ఐక్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అమర్నాథ్ భూ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని ఆయన అన్ని పార్టీలకు పిలుపునిచ్చారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మన నిఘా సంస్థలను, పోలీసు బలగాలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోకపోతే పాకిస్తాన్ తో చర్చల ప్రక్రియను ముందుకు తీసికెళ్లలేమని ఆయన చెప్పారు. కాబూల్ లో భారత దౌత్య కార్యాలయంపై దాడి పాకిస్తాన్ తో సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు దెబ్బ అని ఆయన అన్నారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి స్వస్తి చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదులు, వారి మద్దతు తెలుపుతున్నవారు భారత పాకిస్తాన్ ప్రజలకు, ఇరు దేశాల మధ్య సంబంధాలకు, ఈ ప్రాంతంలో శాంతికి శత్రువులని ఆయన అన్నారు.
దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇతర దేశాలతో, శక్తివంతమైన దేశాలతో భారత్ సంబంధాలు మెరుగుపరుచుకుందని ఆయన చెప్పారు. ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. వ్యవసాయరంగంలో 25 వేల కోట్లు ఖర్చు పెట్టామని ఆయన చెప్పారు. ఉపాధి పెంచాలనేది తమ కొత్త నినాదమని ఆయన చెప్పారు. అణు ఒప్పందం వల్ల విద్యుదుత్పత్తి పెరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications