చిరు సభతో రైల్వేకు రు. 1.35 కోట్లు
హైదరాబాద్: తిరుపతిలో ఈ నెల 26వ తేదీన జరిగిన చిరంజీవి సభకు ప్రత్యేక ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల ద్వారా దక్షిణ మధ్య రైల్వేకు కోటీ 35 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. చిరంజీవి తిరుపతి సభకు దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చిరంజీవి అభిమానులు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన రైలుకు చిన్న వెంకటేశ్వర్లు అనే పారిశ్రామిక వేత్త 13 లక్షల రూపాయలు చెల్లించినట్లు సమాచారం.
చిరంజీవి తిరుపతి సభకు ప్రత్యేకంగా సికింద్రాబాద్, కాకినాడ, ఒంగోలుల నుంచి రెండేసి రైళ్లు, వరంగల్, కరీంనగర్, నర్సారావుపేట, నర్సాపూర్, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, నంద్యాల నుంచి ఒక్కటేసి రైళ్లు వెళ్లాయి. 297 కోచ్ ల్లో లక్షా 50 వేల మంది చిరు అభిమానులు వెళ్లినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. సభకు రైళ్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇంత పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకోవడం దక్షిణ మధ్య రైల్వే విషయంలో ఇది రెండో సారి జరిగింది. గతంలో 2004లో జరిగిన తెలుగుదేశం మహానాడుకు దక్షిణ మధ్య రైల్వే 25 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.












Click it and Unblock the Notifications