చేపలు కొని.. వంట చేసి.. మత్య్సకారుల కుటుంబంతో సీఎం చంద్రబాబు భోజనం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. కావలి నియోజకవర్గంలో 'మత్స్యకారుల సేవలో' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. అనంతరం కావలి మండలం, తుమ్మలపెంట గ్రామంలో మత్స్యకారులతో మాట్లాడారు. అలాగే ఓ మత్స్యకారుల కుటుంబంతో కలిసి నేలపై కూర్చుని వారితో పాటు కలిసి భోజనం చేశారు. అంతకుముందు తుమ్మలపెంటలోని స్థానిక చేపల మార్కెట్‌కు వెళ్లారు. అక్కడి మత్స్యకారులు, మహిళా వ్యాపారులు, తీరప్రాంత వర్తకులతో నేరుగా మాట్లాడారు. స్వయంగా చేపలు కొనుగోలు చేశారు. అలాగే వారి జీవనోపాధి, చేపల వేట పద్ధతులు, మార్కెట్ పరిస్థితులపై ఆరా తీశారు.
మార్కెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్థానిక మత్స్యకారుడు తనం గారి బాబు, ఆయన కుమారుడు గిరి స్వాగతం పలికారు. 'మత్స్యకారుల సేవలో' పథకం కింద అందించే రూ. 20,000 ఆర్థిక సాయం ఆఫ్-సీజన్ లో తమ కుటుంబాలకు గణనీయమైన ఉపశమనాన్ని కలిగించిందని తెలిపారు. ఈ మేరకు సీఎం చంద్రబాబును తమ ఇంటికి ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి వారి ఇంటికి సీఎం వెళ్లారు.

ఆ కుటుంబం చేపల కూర వండుతుండగా సీఎం చంద్రబాబు సైతం గరిటె తిప్పారు. అలా వంటింట్లో కాసేపు కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. వారితోపాటే కుటుంబసభ్యుడిలా కిందే కూర్చుని భోజనం చేశారు. సీఎం చంద్రబాబు తన చేతులతో వారికి చేపల పులుసు వడ్డించడం విశేషం. అలాగే ఆ కుటుంబ సభ్యుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. తమ ఇంటికి వచ్చి తమతో కలిసి భోజనం చేసిన ముఖ్యమంత్రికి తానంగారి బాబు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.












Click it and Unblock the Notifications