చిరంజీవి ఆఫీసులో చెన్నకృష్ణయ్య
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ రిజిస్ట్రేషన్ వివాదంతో తెర మీదికి వచ్చిన కడప జిల్లా లక్కిరెడ్డిపల్లికి చెందిన న్యాయవాది చెన్నకృష్ణయ్య ఆదివారం చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో దర్శనమిచ్చారు. తనకు చిన్నప్పటి నుంచి చిరంజీవి అంటే అభిమానమని, అందుకే స్వచ్ఛందంగానే పార్టీ రిజిస్ట్రేషన్ ను ఉపసంహరించుకున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు.
తాను చిరంజీవిని కలిసి పార్టీ సభ్యత్వం తీసుకుంటానని ఆయన చెప్పారు. పార్టీలో ఏ బాధ్యతలు అప్పగించినా నెరవేరుస్తానని ఆయన చెప్పారు. చిరంజీవి ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ పేరును చెన్నకృష్ణయ్య అదివరకే ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసుకున్నట్లు వార్తలు రావడంతో కలకలం బయలుదేరింది. అయితే ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఆయన తన పార్టీ నమోదును ఉపసంహరించుకున్నారు. చిరంజీవి వర్గంతో కుదిరిన ఒప్పందం మేరకే చెన్నకృష్ణయ్య తన పార్టీ పేరును ఉపసంహరించుకున్నట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications