ఢిల్లీ పేలుళ్ల గురించి తెలుసు: బషీర్
న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుళ్ల గురించి తనకు తెలుసునని అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో ప్రధాన అనుమానితుడు అబూ బషీర్ ఢిల్లీ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. విచారణ సందర్భంగా అతను ఈ విషయాన్ని అంగీకరించినట్లు చెబుతున్నారు. ఢిల్లీ పేలుళ్ల కేసులో విచారణ నిమిత్తం బషీర్ ను గుజరాత్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. అయితే ఢిల్లీలో పేలుళ్లు సంభవించే సమయం తనకు తెలియదని అతను చెప్పాడు.
ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర చేసిన విషయం తనకు తెలుసునని, అయితే పేలుళ్లు సంభవించే తేదీ, సమయం తనకు తెలియవని అతను చెప్పాడు. అబ్దుల్ సుభాన్ తో పాటు ఖయాముద్దీన్, అబ్దుల్ రజాక్ ఢిల్లీ పేలుళ్లుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు అతను వెల్లడించాడు.
ఇండియన్ ముజాహిదీన్ ఈ పేలుళ్లకు పాల్పడిందని అతను చెప్పాడు. పేలుళ్లను అతను సమర్థించుకున్నట్లు కూడా సమాచారం. నిరుడు నవంబర్, ఈ ఏడాది జులై మధ్య కాలంలో తాను ఐదు సార్లు ఢిల్లీ వచ్చినట్లు బషీర్ చెప్పాడు. సిమి సభ్యులను, కార్యకర్తలనే కాకుండా తాను పలువురిని కలిసినట్లు అతను ఒప్పుకున్నాడు. అతను ఎక్కడెక్కడికో వెళ్లాడో కనిపెట్టడానికి పోలీసుసు అతన్ని తీసుకుని అన్వేషణ మొదలు పెట్టారు. బషీర్ ఇచ్చిన సమాచారం మేరకు దక్షిణ ఢిల్లీలోని ఒక ప్రైవేట్ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ను, జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం పిహెచ్ డి స్కాలర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలి పెట్టారు. వీరిద్దరు కూడా ఢిల్లీ వచ్చినప్పుడు అబూ బషీర్ ఉండే అబుల్ ఫజల్ ఎంక్లేవ్ లో ఉంటున్నారు.












Click it and Unblock the Notifications