LPG ధరల షాక్: ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై చమురు కంపెనీలకు భారీ నష్టం.. సంచలన నిర్ణయం దిశగా..?
పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచం మొత్తం సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసింది. దాంతో వాణిజ్యపరమైనటువంటి ఆంక్షలు వచ్చాయి. వీటి కారణంగా ఇంధనం, ఇతర సరకుల రవాణాకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలను వారం వ్యవధిలో రెండు సార్లు పెంచింది కేంద్ర ప్రభుత్వం. అలాగే దేశంలోని చాలా ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. గ్యాస్ డెలివరీలో జాప్యం జరుగుతోంది. దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు చిరువ్యాపారుల ఉపాధిపైనా ప్రభావం పడుతోంది.
అయితే 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ దిగుమతి వ్యయం రూ. 1,530 అవుతోంది. కానీ సాధారణ వినియోగదారులకు ఈ సిలిండర్ ను రూ. 913 కే విక్రయిస్తున్నారు. దీనివల్ల ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మే 2026 నుంచి ఒక్కో సిలిండర్ పై ఏకంగా రూ. 617 నష్టాన్ని భరిస్తున్నాయి. ఈ భారం జనవరి నుంచి మార్చి వరకు రూ. 100, ఏప్రిల్ లో రూ. 171 ఉండగా ఇరాన్ సంక్షోభం కారణంగా ఒక్కసారిగా రూ. 617 కు పెరిగింది.
ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు ఈ సిలిండర్ కేవలం రూ. 613 కే లభిస్తోంది. దీనివల్ల చమురు కంపెనీలపై మరింత భారం పడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎల్పీజీ విక్రయాల వల్ల చమురు కంపెనీలు మొత్తం సుమారు రూ. 60 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయి. కేవలం ఏప్రిల్- మే రెండు నెలల్లోనే ఈ నష్టం రూ. 40 వేల కోట్లకుపైగా అంచనా వేశారు. ఇక భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారుగా ఉంది.

మన దేశంలో వినియోగించే గ్యాస్ లో 60 శాతం దిగుమతి చేసుకుంటుండగా అందులో 90 శాతం మిడిల్ ఈస్ట్ నుంచే వస్తోంది. ఇక గృహాలకు గ్యాస్ కొరత రాకుండా చూసేందుకు ప్రభుత్వం ప్రస్తుతం పరిశ్రమలకు సరఫరాను తగ్గించింది. అయితే ప్రస్తుతం చమురు కంపెనీలు భారీగా భారాన్ని మోస్తున్న క్రమంలో త్వరలోనే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications