ఆమెను చూశా, అయిపోయా: చిరు
హైదరాబాద్: తన భార్య సురేఖను శంకరాభరణం ప్రివ్యూ కగ వెళ్లినప్పుడు చూశానని, అప్పుడే ఓ చూపు వేశానని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. అంత అందంగా ఉందని కాదు గానీ బుద్ధిగా, ఒద్దికగా తెలుగమ్మాయిలా వుందని, దాంతో ఆమెపై ఓ చూపు వేశానని, ఆ తర్వాత కొద్ది రోజులకే పెళ్లి జరిగిందని, దాంతో స్వాతంత్ర్యం కోల్పోయానని ఆయన వివరించారు. పద్మశ్రీ అల్లు రామలింగయ్య కళాపీఠం జాతీయ పురస్కారాన్ని దర్శకుడు కె. విశ్వనాథ్ కు ప్రదానం చేసిన కార్యక్రమంలో ఆయన బుధవారం సాయంత్రం ప్రసంగించారు.
తమ కుమారుడు రామచరణ్ తేజా విశ్వనాథ్ దర్శకత్వంలో నటించడానికి మనసు పడుతున్నట్లు ఆయన తెలిపారు. శుభలేఖ సినిమాలో మిమ్మల్ని విశ్వనాథ్ వైవిధ్యంగా చూపారు, నాకూ విశ్వనాథ్ దర్శకత్వంలో చేయాలని ఉంది, ఒప్పుకుంటారా అని రామచరణ్ తనతో అన్నట్లు ఆయన వివరించారు. విశ్వనాథ్ తన జీవితంలో జక్కన లాంటివారని ఆయన అన్నారు. స్వయంకృషి సందర్భంగా తనకు పెరగన్నం పెట్టారని, చిన్నప్పుడు నాన్న చేతితో గోరుముద్దలు తిన్నానని, పెద్దయ్యాక విశ్వనాథ్ చేతి ముద్దలు తిన్నానని ఆయన అన్నారు.
ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది సాకారమవుతుందని దర్శకుడు విశ్వనాథ్ చిరంజీవి రాజకీయ ప్రవేశంపై అన్నారు. తన భార్య కష్టమైనా వీలు చేసుకుని వచ్చిందని, రేపు చిరంజీవి ఏ స్థాయికి వెళ్తారో చూడడానికి వీలవుతుందో కాదో ఇప్పుడే చూద్దామని ఆమె వచ్చిందని ఆయన వివరించారు. చిరంజీవి కాబోయే సిఎం అంటూ ప్రేక్షకులు నినాదాలు చేశారు. అది జరిగి తీరుతుందని విశ్వనాథ్ ఈ సమయంలో అన్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, పి. సుశీల, అల్లు కుటుంబ సభ్యులు తదితరులు వచ్చారు.












Click it and Unblock the Notifications