క్రీమీలేయర్ ఆదాయ పరిమితి పెంపు
న్యూఢిల్లీ: క్రీమీలేయర్ కు వార్షిక ఆదాయ పరిమితిని రెండున్నర లక్షల రూపాయల నుంచి నాలుగున్నర లక్షల రూపాయలకు పెంచుతూ కేంద్ర మంత్రివర్గం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఒబిసిలకు ఇతోధికమైన ఊరట లభిస్తుంది. నాలుగున్నర లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం ఉన్న ఒబిసిలు క్రీమీలేయర్ కిందికి రాబోరని సమాచార, బ్రాడ్ కాస్టింగ్ మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. సివిల్ సర్వీసు ఉద్యోగాలకు, కేంద్ర విద్యా సంస్థల్లో ప్రవేశానికి దీని వల్ల మరింత మందికి రిజర్వేషన్లు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.
2004 ఫిబ్రవరిలో ఆదాయ పద్ధతులను సవరించిన తర్వాత వచ్చిన ఆర్థిక మార్పులను దృష్టిలో ఉంచుకుని మంత్రి వర్గం ఆ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు క్రీమీలేయర్ కిందికి వచ్చే వారికి రిజర్వేషన్లు వర్తించవు. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు లాభం చేకూరే విధంగా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందని దాస్ మున్షీ చెప్పారు.












Click it and Unblock the Notifications