భూ అవినీతిపై పోరుకు బాబు పిలుపు

ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువ చేసే భూములను అన్యాక్రాంతం చేసిందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇన్ఫోసిస్ కు 30 ఎకరాల భూమి ఇచ్చామని, 30 వేల మందికి ఉపాధి కల్పించాలని షరతు విధించామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 470 ఎకరాల భూమి ఇచ్చిందని, దాని వల్ల ఎంత ప్రయోజనం కలిగిందో ప్రభుత్వం వెల్లడించాలని ఆయన అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐటి కంపెనీలన్ని తమ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రానికి వచ్చాయని ఆయన చెప్పారు. పరిశ్రమలకు అడ్డూ అదుపులేకుండా వందలాది ఎకరాల భూములను కారచౌకగా ఇస్తోందని, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. విశాఖపట్నంలో ఒక కంపెనీకి వేయి ఎకరాల భూమిని ఎకరా రూపాయి ధరకు అప్పగించిందని ఆయన అన్నారు. టెక్నోక్రాట్ కు 750 ఎకరాలు అప్పగించిందని ఆయన చెప్పారు.
పేదలకు, మధ్యతరగతి వారికి ఇల్లు కట్టుకునేందుకు కూడా లేకుండా భూములను ప్రభుత్వం అన్యాక్రాంతం చేస్తోందని, హౌసింగ్ బోర్డు మధ్యతరగతి ఇంటి ఆశలను సాకారం చేసేదని, ఇప్పుడు దాని భూములను పెద్దలకు అమ్ముతోందని ఆయన అన్నారు. భూముల అన్యాక్రాంతంలో పెద్ద యెత్తున అవినీతి చోటు చేసుకుందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి అవినీతి ఊబిలో కూరుకపోయారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications