గ్రామాల్లోనూ ఆన్ లైన్ సేవలు: ఐటి మంత్రి
హైదరాబాద్: దొంగతనాలు, ఇతర నేరాలపై ఈ-సేవ కేంద్రాల్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి)పై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ-సేవ కేంద్రాల్లో చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసే అంశంపై హోంశాఖతో చర్చించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దామోదర్‌రెడ్డి తెలిపారు. ఫైళ్ల పెండింగుకు కారణాలను సాధారణ ప్రజలు తెలుసుకోవడానికి తొలుత 10 ప్రభుత్వ శాఖల్లో ఫైల్ ట్రాకింగ్ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.
ఏపీ స్వాన్ ప్రాజెక్టు కింద రూ.249 కోట్లతో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఆన్‌లైన్ కనెక్టివిటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. పట్టణాల్లో మాదిరిగా గ్రామాల్లోనూ ఆన్ లైన్ సేవలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని 4687 గ్రామాల్లో రాజీవ్ సిటిజన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల గ్రామీణ ప్రజలకు కూడా ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications