ఆగని అల్లర్లు: ఆరుగురు సజీవ దహనం
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా భైంసా సమీపంలోని వటోలీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు. దుండగులు ఇంటికి నిప్పంటించడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు,ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ఈ ఘోరం ఆదివారం తెల్లవారు జామున జరిగింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామాన్ని పోలీసులు చుట్టుముట్టారు. వటోలీ భైంసాకు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దుర్గాదేవి నిమజ్జనోత్సవం సందర్భంగా ఇటీవల భైంసాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే.
భైంసా ఘర్షణలే వటోలీకి పాకినట్లు అనుమానిస్తున్నారు. భైంసాలో కర్ప్యూ కోనసాగుతోంది. భైంసా, నిర్మల్ ల్లో 144వ సెక్షన్ ను విధించారు. వటోలీ సంఘటనా స్థలాన్ని బిజెపి నేత జి. కిషన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్. వేణుగోపాలాచారి విడివిడిగా సందర్శించారు. భైంసాలో పరిస్థితిని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కరీంనగర్ జిల్లా సిరిసిల్లా నుంచే సమీక్షించారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆయన హోం మంత్రి కె. జానారెడ్డిని ఆదేశించారు. దీంతో జానారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications