Gold: దశాబ్దం చూడని పతనం.. అడ్డూఅదుపు లేకుండా పడిపోతున్న ధరలు
బంగారం, వెండి.. భారతీయులకు కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, ఒక సురక్షితమైన పెట్టుబడి. ఎప్పుడు చూసినా రికార్డు స్థాయి ధరలతో సామాన్యుడికి చుక్కలు చూపించే పసిడి.. ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ గేర్ వేసింది. గత ఐదు త్రైమాసికాలుగా లాభాల బాటలో నడిచిన పసిడి, వెండి ధరలు ఈ జూన్ త్రైమాసికంలో ఘోరంగా పతనమయ్యాయి. బంగారం పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ త్రైమాసిక పతనాన్ని చవిచూడబోతుంటే, వెండి నాలుగేళ్లలో అత్యంత దారుణమైన నష్టాల దిశగా పయనిస్తోంది
ఆకాశం నుంచి అగాధంలోకి..!
గత రెండేళ్లుగా బంగారం, వెండి ధరలు పరుగుల గుర్రాల్లా దూసుకెళ్లాయి. కానీ, ఈ జూన్ క్వార్టర్ లో కథ అడ్డం తిరిగింది. ఈ క్వార్టర్‌లో బంగారం ధర దాదాపు 12 శాతం మేర క్షీణించింది, ఇది 2016 డిసెంబర్ తర్వాత నమోదైన అత్యంత భారీ పతనం. ఇక వెండి పరిస్థితి మరీ ఘోరం.. దాదాపు 17.6 శాతం మేర పడిపోయి, 2022 జూన్ తర్వాత అత్యంత చెత్త ప్రదర్శనను నమోదు చేసింది. ఒకానొక దశలో ఒక అౌన్స్ బంగారం రికార్డు స్థాయిలో $5417 తాకగా, అక్కడి నుంచి ఏకంగా 24 శాతం పడిపోయింది. అలాగే జనవరి 28న $117 వద్ద ఆల్‌టైమ్ హై రికార్డు సృష్టించిన వెండి.. ఏకంగా 47 శాతం మేర కుప్పకూలింది.

'గోల్డెన్ రన్' కు ఎలా బ్రేక్ పడింది?
2024, 2025 సంవత్సరాల్లో బంగారం, వెండి ధరలు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించాయి. 2025లోనే బంగారం 65 శాతం పైగా, వెండి 148 శాతం పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2026 ప్రారంభంలో కూడా ఈ జోరు సాగింది. అయితే, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య మధ్యంతర శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గాయి. దీంతో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దిగిరావడంతో సురక్షితమైన పెట్టుబడిగా ఉన్న బంగారంపై ఇన్వెస్టర్లు ఆసక్తి తగ్గించుకున్నారు.
వడ్డీ రేట్ల సెగ.. దూసుకుపోతున్న డాలర్!
ధరల పతనానికి ప్రధాన కారణం అమెరికా సెంట్రల్ బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' తీసుకుంటున్న కఠిన నిర్ణయాలేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం (ఇన్ఫ్లేషన్) ఇంకా అదుపులోకి రాకపోవడంతో, కొత్త ఫెడ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ వడ్డీ రేట్లను మరింత పెంచేలా కఠిన సంకేతాలు ఇచ్చారు. బంగారం, వెండిలపై ఎలాంటి వడ్డీ రాదు కాబట్టి, బ్యాంక్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు తమ డబ్బును బాండ్లలో పెట్టుబడి పెట్టడానికే మొగ్గు చూపుతారు. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ ఏడాది కాలంలోనే అత్యంత గరిష్ట స్థాయికి చేరి, బలపడటం కూడా పసిడిని కోలుకోకుండా చేస్తోంది.
నిపుణులు ఏమంటున్నారు?
యాక్సిస్ డైరెక్ట్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దేవేయ గగ్లానీ అభిప్రాయం ప్రకారం.. డాలర్ ఇండెక్స్ $100 స్థాయి కంటే పైన ఉన్నంత కాలం బంగారం, వెండి ధరలపై ఈ ఒత్తిడి ఇలాగే కొనసాగుతుంది. అటు టెక్నాలజీ షేర్ల పతనం కూడా పసిడి మార్కెట్‌ను మరింత కుంగదీసింది.
సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగితే బంగారం ధరలు పెరుగుతాయి, కానీ ఈసారి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు పసిడిని కోలుకోకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రేడర్లు అందరూ గురువారం విడుదల కాబోయే అమెరికా పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ (PCE) ప్రైస్ ఇండెక్స్ డేటా కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ద్రవ్యోల్బణం మరింత పెరిగినట్లు తేలితే, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయని, అప్పుడు బంగారం ధరలు మరికొంత కాలం ఇలాగే నీరసించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.














Click it and Unblock the Notifications