ట్రంప్ కు నెతన్యాహు మరో షాక్..! కథ మళ్లీ మొదటికి..!
ఇరాన్ వార్ లో అమెరికా తమకు ఎంతగా సహకరిస్తున్నా.. తమ ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడేందుకు ఇజ్రాయెల్ (Israel) ససేమిరా అంటోంది. ముఖ్యంగా గాజాలో ఘర్షణల నివారణకు ట్రంప్ ప్రతిపాదించిన 15 పాయింట్ల ఫార్ములాను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benzamin Netanyahu) ఇవాళ తోసిపుచ్చారు. ఈ ఫార్ములా ప్రకారం హమాస్ పూర్తిగా ఆయుధాలు విడిచే వరకూ, గాజా నుంచి తమ దళాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదని ట్రంప్ కు తేల్చిచెప్పేశారు. ఇజ్రాయెల్ కేబినెట్ భేటీ సందర్భంగా నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు.
హమాస్ నిజంగా నిరాయుధులయ్యే వరకు ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణ చేపట్టదని, తమ బలగాలకు, తమ పౌరులకు ఎదురయ్యే ముప్పులను అడ్డుకుంటూనే ఉంటుందని నెతన్యాహు క్యాబినెట్ సమావేశంలో తేల్చిచెప్పారు. గాజా యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లోని ఒక కీలక అంశాన్ని నెతన్యాహు తన వ్యాఖ్యలతో తిరస్కరించినట్లయింది. ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి తగ్గే ముందు హమాస్ తన ఆయుధాలను వదులుకోవాలని ఆయన పట్టుబడుతున్నారు.

గాజాలో ఘర్షణల్ని ముగించే తన ప్రణాళికలో ఓ పురోగతి లభించిందని, ఇజ్రాయెల్, హమాస్ రెండూ ఈ ఒప్పందానికి అంగీకరించాయని ట్రంప్ గత నెలలో ప్రకటించారు. దీని తర్వాత గత సంవత్సరం కాల్పుల విరమణ ప్రారంభమైంది. అలాగే యుద్ధానికి దారితీసిన 2023 నాటి ఇజ్రాయెల్‌పై దాడికి ముందు దాదాపు రెండు దశాబ్దాల పాటు గాజాను నియంత్రించిన హమాస్, ఇప్పుడు తన ఆయుధాలను వదిలేసేందుకు అంగీకరించిందని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ గత అక్టోబర్‌లో అంగీకరించిన కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ గాజాలో దాడులు కొనసాగిస్తోంది. ఇప్పుడు బలగాల ఉపసంహరణ కూడా ఉండబోదని తేల్చేసింది. దీంతో ట్రంప్ ప్రయత్నాలన్నీ విఫలమైనట్లయింది.




Click it and Unblock the Notifications