ప్రభుత్వ అసమర్థత వల్లే భైంసా ఘటన: కెసిఆర్
హైదరాబాద్/ ఆదిలాబాద్: ప్రభుత్వ అసమర్థత వల్లనే ఆదిలాబాద్ జిల్లా భైంసాలో అల్లర్లు చెలరేగాయని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విమర్శించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఆదివారంనాడు ఆయన అల్లర్లు జరిగిన భైంసాను సందర్శించారు. ప్రభుత్వ చేతకానితనానికి భైంసా ఉదంతం నిదర్శనమని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలేసి నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్ల దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆయన అన్నారు.
భైంసా సంఘటనల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్యనాయుడు విమర్శించారు. ఉగ్రవాదం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు బుజ్జగింపు రాజకీయాల వల్ల అనర్థాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉదాసీనతను తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్. వేణుగోపాలాచారి విమర్శించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం తమ పార్టీ నేత నారా చంద్రబాబునాయుడు భైంసాలో పర్యటిస్తారని ఆయన చెప్పారు. మిగతా నాయకులతో కలిసి ఆయన ఆదివారం భైంసాను సందర్శించారు.












Click it and Unblock the Notifications