జెసివి నవ్వులాట మాటలు: రామకృష్ణ
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే అనంతపురం జిల్లాలో కలపాలని పంచాయతీరాజ్ మంత్రి జెసి దివాకర్ రెడ్డి అనడం నవ్వులాటగా ఉందని సిపిఐ సీనియర్ నాయకుడు రామకృష్ణ అన్నారు. అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలపాలని జెసి దివాకర్ రెడ్డి మాటలకు జిల్లా ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అనంతపురం జిల్లా ప్రజలు సమైక్య రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మంత్రులు జెసి దివాకర్ రెడ్డి, రఘువీరారెడ్డి వల్ల అనంతపురం జిల్లా వెనకబడి పోయిందని ఆయన అన్నారు.
కర్ణాటకలో కలిపితే అనంతపురం జిల్లా అభివృద్ధి చెందుతుందనే దివాకర్ రెడ్డి మాటలో వాస్తవం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అంశం ముందుకు వచ్చిన ప్రతిసారీ అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలపాలని జెసి దివాకర్ రెడ్డి అంటున్నారని, అలా ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదని, జెసి దివాకర్ రెడ్డి వ్యాపారాలు, సంస్థలు కర్ణాటకలో ఉన్నాయని, అందుకే జెసి ఆ మాటలు అంటున్నారేమోనని ఆయన అన్నారు. ఉక్కు పరిశ్రమను, ఇతర పరిశ్రమలను ముఖ్యమంత్రి కడప జిల్లాలోనే పెడుతున్నారని, అనంతపురం జిల్లాకు ఏమీ చేయడం లేదని, అయినా మంత్రులు జెసి, రఘువీరా రెడ్డి మాట్లాడడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications