కోస్తా కారిడార్ రోడ్డు మాత్రమే: వైయస్
శ్రీకాకుళం : కోస్టల్ కారిడార్‌పై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోపించారు. ఇచ్చాపురం నుంచి తడ వరకు కేవలం రహదారిని మాత్రమే నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలకు అభ్యంతరాలుంటే నిర్మాణాన్ని నిలిపివేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. ఇచ్ఛాపురం ప్రజాప్రస్థానం పార్కును ఆయన ఆదివారంనాడు ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయానికి ఆయన 60 లక్షల రూపాయలు మంజూరు చేశారు. కోస్టల్ కారిడార్ కు ప్రైవేట్ భూములను సేకరించబోమని, ఒకవేళ సేకరించినా హైదరాబాదు అవుటర్ రింగ్ రోడ్డుకు భూసేకరణకు చెల్లించిన నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన చెప్పారు. కోస్టల్ కారిడార్ అనేది రోడ్ల అభివృద్ధిలో భాగంగానే జరుగుతోందని ఆయన చెప్పారు. అనంతరం ఆయన కోటబొమ్మాళి నుంచి నర్సన్నపేట వరకు రోడ్ షో నిర్వహించారు. జాతీయ రహదారికి ఇరుపక్కలా ప్రజలు బారులు తీరారు.
విశాఖపట్నంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యుఐ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. యువతకు ఉపాధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఇబిసి విద్యార్థులకు ఫీజులో మినహాయింపు ఇస్తామని, ఇందుకు వంద కోట్ల రూపాయల దాకా ఖర్చు చేస్తామని, దీన్ని వచ్చే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో చేరుస్తామని ఆయన చెప్పారు. పోలీసు శాఖలో 37 వేల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 50 వేల ఉపాధ్యాయుల పోస్టులను కూడా భర్తీ చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications