జెసిపై వెనక్కి తగ్గని గొల్లపల్లి
హైదరాబాద్: తన సహచర మంత్రి జెసి దివాకర్ రెడ్డికి ఆర్థిక మంత్రి కె. రోశయ్య నేతృత్వంలోని మంత్రుల కమిటీ క్లీన్ చిట్ ఇవ్వడంపై లఘు పరిశ్రమల మంత్రి గొల్లపల్లి సూర్యారావు అభ్యంతరం తెలిపారు. తాను ఎవరికీ క్షమాపణలు చెప్పలేదని, చెప్పే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. తూర్పూ గోదావరి జిల్లా ఇసుక ర్యాంపులో పంచాయతీ రాజ్ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఏడు కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని గొల్లపల్లి సూర్యారావు బహిరంగంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మంత్రుల వివాదంపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రోశయ్య నేతృత్వంలో ముగ్గురు మంత్రుల కమిటీ వేశారు. ఈ కమిటీ మంగళవారం సాయంత్రం తన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించింది.
మంత్రుల కమిటీ జెసి దివాకర్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది. మంగళవారం సాయంత్రం జెసి దివాకర్ రెడ్డి మంత్రుల కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించారు. అదే విధంగా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరు మరో వివాదానికి దారి తీసింది. తాను విషయం చెప్పినప్పుడు ముఖ్యమంత్రి తల ఊపారని, దానికి అర్థం ఏమిటో తనకు తెలియదని అని జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఎలా తల ఊపారో ఆయన రెండు సార్లు చేసి చూపించారు.












Click it and Unblock the Notifications
