కోస్టల్ కారిడార్ జీవో రద్దు
హైదరాబాద్: ప్రతిపక్షాలు విరుచుకుపడటంతో కోస్టల్ కారిడార్‌పై రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవోనెం 34ను ఉపసంహరించుకుంది. గత నెలలోనే శ్రీకాకుళం రోడ్‌షోలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజలు వద్దంటే కోస్తా కారిడార్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పారు. కోస్తా తీరం వెంబడి 972కిలోమీటర్ల మేరకు పీసీపీఐఆర్, వాన్‌పిక్‌ల ఆధ్వర్యంలో కోస్తా కారిడార్ నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రభుత్వం గతంలో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ప్రతిపాదన ప్రకారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు కోస్తా కారిడార్ పేరిట అభివృద్ధి జరపాలన్నది ప్రభుత్వం యోచనగా చెప్పుకొస్తున్నది.
అయితే కోస్తా తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు, ఇతర గ్రామస్థుల నుండి కూడా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మెట్టుదిగక తప్పలేదు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కారిడార్ జీవో ఉపసంహరణపై ఈ వివరాలను ఓడరేవులు, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ మీడియాకు తెలియజేశారు. కోస్తా కారిడార్ అధ్యయనం కోసమే ప్రభుత్వం ప్రయత్నించిందని అంతేకానీ, ప్రజలకు వ్యతిరేకంగా ఉన్న ఏ ప్రాజెక్టును ప్రభుత్వం ముందుకు తీసుకుపోదని మంత్రి వివరించారు.
కోస్తా కారిడార్ ప్రాజెక్టుల కింద తీరం వెంబడి 50 లక్షల ఎకరాలను సేకరించి ప్రాజెక్టు నిర్వాహకులకు అప్పగించాల్సి ఉంది. పెట్రోలియం, కెమికల్, మరియు పెట్రో కెమికల్ పెట్టుబడుల ప్రాంతం (పీసీపీఐఆర్) కు సెజ్‌ల కింద వేలాది ఎకరాల భూమిని దీంతో పాటుగా ఓడరేవు, నిజాంపట్నం, పారిశ్రామిక కారిడార్ (వాన్‌పిక్)కు వేలాది ఎకరాలు అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీంతో సుమారుగా 2కోట్ల 30 లక్షల మంది నిర్వాసితులు అవుతారని ప్రజా ఉద్యమ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టులకు 13 లక్షల కోట్లు పెట్టుబడిగా పెడుతున్నారు. ఈ ప్రాజెక్టు కింద కోస్తా తీరం వెంబడి సిక్స్ లెన్ రహదారులు నిర్మించాల్సి ఉంది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతున్న సమయంలో కోస్తో కారిడార్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టి ప్రజల్లో చైతన్యం కలిగించాలనీ, తర్వాత రాజకీయ లబ్ధి పొందాలని ప్రతిపక్షాలన్ని ఐక్యమై తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో వైఎస్ ప్రభుత్వం సంకట స్థితిలో పడింది. ఎన్నికల వేల ప్రజల్లో వ్యతిరేకత కలిగించే ప్రాజెక్టులను ఉపసంహరించుకోవడమే ముందున్న నిర్ణయానికి వచ్చిపడింది. అందుకే ఇప్పుడు కోస్తా కారిడార్ సంబంధించిన జీవో నెం34ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications