టికెట్ల అమ్మకంపై బిజెపి ఎంపి రాజీనామా
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభ ఎన్నికల టికెట్ల పంపిణీలో పెద్ద యెత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపిస్తూ రాజస్థాన్ లోని భరత్ పూర్ భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటు సభ్యుడు విశ్వేంద్ర సింగ్ గురువారం రాజీనామా చేశారు. ఈ విషయంపై ఆయన ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని, ఇందుకు నిజాయితీ గల కార్యకర్తలను బలి పెట్టారని, ఈ విషయం తెలిసినప్పటికీ కేంద్ర నాయకత్వం ప్రేక్షక పాత్ర వహించిందని ఆయన విమర్శించారు.
తాను పార్టీకే కాకుండా లోకసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె సలహాదారుగా పార్టీ పనితీరును తాను చాలా సన్నిహితంగా చూశానని, పార్టీ అవినీతికి నిలయంగా మారిందని ఆయన అన్నారు. ఇదిలా వుంటే, రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే మరో 43 మంది అభ్యర్థుల జాబితాను బిజెపి విడుదల చేసింది. డజను మంది శాసనసభ్యులకు పార్టీ టికెట్లు నిరాకరించారు. టికెట్లు లభించనివారిలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు.












Click it and Unblock the Notifications