హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులో 30 రోజుల్లోగా చార్జీషీట్ దాఖలు చేయాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ నాగార్జున చెప్పారు. వరంగల్ జిల్లాలో చిరంజీవిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టు కింద కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ పూర్తి చేసి 30 రోజుల్లోగా పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత దాన్ని కమిషన్ కు పంపాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. చిరంజీవి వరంగల్ జిల్లాలో రోడ్ షో నిర్వహించినప్పుడు తనను అవమానించాడంటూ ఒక వ్యక్తి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేశాడు. దీంతో చిరంజీవిపై కేసు నమోదు చేశారు.