రైస్ తో జర్దారీ భేటీ: సహకారానికి రెడీ
ఇస్లామాబాద్: ముంబై దాడుల కేసులో భారత్ కు సహకరించడానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ తో గురువారంనాడు పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సమావేశమయ్యారు. బాధ్యులను శిక్షించడంపై, భవిష్యత్తులో దాడులను నిరోధించడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని ఆమె సూచించారు. భారత్, పాక్ లు పరస్పర సమాచార వినిమయానికి దారులు తెరిచే ఉంచుకుంటాయని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. న్యాయం చేయడానికి అన్ని బాధ్యతాయుతమైన దేశాలు పరస్పరం సహకరించుకోవాలని ఆమె అన్నారు.
ఉగ్రవాద దాడులు చేయడానికి తమ దేశాన్ని ఉపయోగించుకోవడాన్ని తాము సహించబోమని జర్దారీ చెప్పారు. ముంబై ఉగ్రవాద దాడుల కేసు దర్యాప్తునకు సహకరించడానికి పాక్ సిద్ధంగా ఉందని, దాడులకు పాల్పడివారు ఎవరైనా వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బుధవారం భారత నేతలతో సమావేశమైన కండోలిజా రైస్ గురువారం పాకిస్థాన్ పర్యటనకు వచ్చారు. పాకిస్థాన్ లో ఉగ్రవాద దాడులను నిరోధించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇస్లామాబాద్ చేరుకోగానే ఆమె పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అస్ఫాక్ పర్వేజ్ కయానీతో మాట్లాడారు. పాకిస్థాన్ ముంబై దాడులకు సంబంధించి పారదర్శకంగా వ్యవహరించాలని, భారత్ కు పాక్ ఇచ్చిన హామీల విషయంలో సత్వరమే చర్యలు చేపట్టాలని రైస్ సూచించారు.












Click it and Unblock the Notifications